Posts

Showing posts from June, 2020

కాంత - అన్యాక్రాంత - కౌంతేయ

కోరిక సుడిగాలై  పాకింది నరాలలో విజయుడి బహుమతి కైవసం చేసుకున్న తొలి రేయిలో. అపుడేమైంది పాంచాలీ జగన్మోహినన్న నీ గర్వానికి నేనూ విజేతనే తెర మరుగున అన్న ఆ మగతనానికి? ఊపిరిసల్పనీయలేదా నిన్ను పశ్చాత్తాపం లేని బాహువులతో నైపుణ్యంగా తానే గెలుచుకున్నట్లు నిన్ను, స్వహస్తాలతో? నీ హొయలలో మోహం మాటు అయ్యిందా అతని క్రింద నీ నడుము ఒలలూగినప్పుడు? ఆ కేళిలో, వాడి వేడిలో చలించి అకస్మాత్తుగా సెగలు బూడిదై, నిట్టూర్పుతో అతను కృంగిపోగా యవ్వన సంభోగలోలమైన నీ ఓజస్సులో సుఖభంగాన్ని కప్పిబుచ్చే సంయమనం దాగిందా? గదాధారుడు కాదు, ధనుష్టంకారం చేయలేడు కానీ యెనలేని అహంకారాన్ని త్యజించలేని ధీరుడాతడు. --- Free translation of a sonnet from  "Yuddhistira & Draupadi" by Pavan Varma. Inspired by Gulzar's translation to Hindi

యుధిష్ఠిర! మృత్యువు ప్రసన్నమైనప్పుడు మనిషి యొక్క ఆప్తమిత్రుడు ఎవరు?

క్షణాలను కాలసర్పం కబళించే ఘడియల్లో మృత్యుదేవత చల్లని వడిలో వాలే వేకువలో అహోరాత్రులూ పోగేసిన ధనరాశి, అహర్నిశం తోడున్న జీవిత భాగస్వామి కానేరవు మహాత్మా , మనిషికి స్నేహితులు ఒంటరై, మనుజుడొక్కడే, మునుపెరుగని మనుగడదెలియని మరుభూమిలో చిరుగాలిలో రెపరెపలాడే ఆకు నేలవ్రాలినట్లు,చేరడా మహాప్రస్థానంలో సమసిపోయే ప్రమిధ మహోజ్వలంగా వెలిగిపోయినట్లుగా కుంగి పోయే కుసుమం జిలుగు రంగుల గుబాళింపు పరిమళించినట్లుగా జగన్నాథా! చితిమంటల ఆధారమే ఈ కాషాయంలో కట్టెలవలే తేలెనే బ్రతుకు కోరికల సుడిగుండంలో జీవితానికి నిశ్వాస, స్ఫురించునే అగ్నికీలల పావకంలో అరిషడ్వార్గాలు భస్మీపటలం చేయుమా ఈ హవనంలో స్వార్ధానికి అతీతమైన స్వచ్ఛమైన ప్రార్థన విశాల గగనాన్ని తాకదా చేసిన ధర్మము చెడని పదార్ధమై మన వెంట చేరదా ధర్మదేవతలో ఐక్యమయ్యే ముహూర్తంలో దాత్రుగుణమే మన ఆప్త బంధువు కాదా! ---- Free translation of a sonnet from  "Yuddhistira & Draupadi" by Pavan Varma. Inspired by Gulzar's translation to Hindi