మృత భాషల పంథాలో తెలుగు
తెలుగు బాష కొంచం కొంచం గా మన ముందే అంతరించి పోతోంది. తెలుగు సాహిత్యం చదివే వాళ్ళ సంఖ్య నానాటికి తగ్గిపోయింది. సాహిత్యం దాకా ఎందుకు, తెలుగు లో చదవగలిగే వాళ్లే కరువు అయిపోతున్నారు. ఇంటిలో తల్లి తండ్రుల ప్రవృత్తి, బడిలో చదువులు రెండూ తెలుగు ని కాటికి పంపిస్తున్నాయి. ఇదే విధం గా సాగితే ఇంకో నలభై సంవత్సరాల్లో తెలుగు లో రాసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే క్రొత్త రచనలు రావు. ఆ పై నలభై సంవత్సరాల్లో మాట్లాడే వాళ్లు కూడా ఉండరు. 2100 కల్లా తెలుగు మృత బాష అవ్వడం తథ్యం. తెలుగు చచ్చిపోవడం అంటే ఏంటి? పోతన భాగవతం గతించి పోవడం. స్మశానంలో ఉండే నీకు ఇద్దరు భార్యలు ఎందుకు అని శివుడినే నిలదీసిన శ్రీనాధ చాటువుకి చాటింపు లేకపోవడం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న క్రిష్ణదేవరాయులు ధీమాని మన చేజేతులా చట్టుబండలు చెయ్యడం. తెలుగు చచ్చిపోవడం అంటే - త్యాగయ్య గాత్రాలు త్యజించు కోవడం. కుతుబ్ షా చెరలో రామదాసు వ్యధ వ్యర్థం కావడం. అన్నమయ్య కీర్తనలులేక బ్రహ్మపాదం మలిన పడడం. తెలుగు చచ్చిపోవడం అంటే - మధురవాణి మూగబోయి, గురజాడ కన్యాశుల్కం శుష్కించుకు పోవడం. చిలకమర్తి గారి పాడి ఆవు అనాధ అయిపోవడ...