మృత భాషల పంథాలో తెలుగు
తెలుగు బాష కొంచం కొంచం గా మన ముందే అంతరించి పోతోంది. తెలుగు సాహిత్యం చదివే వాళ్ళ సంఖ్య నానాటికి తగ్గిపోయింది. సాహిత్యం దాకా ఎందుకు, తెలుగు లో చదవగలిగే వాళ్లే కరువు అయిపోతున్నారు. ఇంటిలో తల్లి తండ్రుల ప్రవృత్తి, బడిలో చదువులు రెండూ తెలుగు ని కాటికి పంపిస్తున్నాయి. ఇదే విధం గా సాగితే ఇంకో నలభై సంవత్సరాల్లో తెలుగు లో రాసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే క్రొత్త రచనలు రావు. ఆ పై నలభై సంవత్సరాల్లో మాట్లాడే వాళ్లు కూడా ఉండరు. 2100 కల్లా తెలుగు మృత బాష అవ్వడం తథ్యం.
తెలుగు చచ్చిపోవడం అంటే ఏంటి? పోతన భాగవతం గతించి పోవడం. స్మశానంలో ఉండే నీకు ఇద్దరు భార్యలు ఎందుకు అని శివుడినే నిలదీసిన శ్రీనాధ చాటువుకి చాటింపు లేకపోవడం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న క్రిష్ణదేవరాయులు ధీమాని మన చేజేతులా చట్టుబండలు చెయ్యడం.
తెలుగు చచ్చిపోవడం అంటే - త్యాగయ్య గాత్రాలు త్యజించు కోవడం. కుతుబ్ షా చెరలో రామదాసు వ్యధ వ్యర్థం కావడం. అన్నమయ్య కీర్తనలులేక బ్రహ్మపాదం మలిన పడడం.
తెలుగు చచ్చిపోవడం అంటే - మధురవాణి మూగబోయి, గురజాడ కన్యాశుల్కం శుష్కించుకు పోవడం. చిలకమర్తి గారి పాడి ఆవు అనాధ అయిపోవడం. గిడుగు పంతులుగారి భాషోద్యమం వెలవెల పోవడం.
తెలుగు చచ్చిపోవడం అంటే - కల్పకల్పాలకు నీడనిచ్చే విశ్వనాధ కల్పవృక్షం పెకలించ పడడం. దేవులపల్లి ప్రియ భారతి లో భావం భూస్థాపితం చేయడం. శ్రీశ్రీ మహాప్రస్థానం యొక్క పదఝరి ఉడుకురక్తాలలో ప్రవహించకపోవడం.
తెలుగు చచ్చిపోవడం అంటే - చలంగారి మైదానం అభ్యుదయ మైదానం నుంచి కనుమరుగు కావడం. గోపీచంద్ అసమర్ధుని జీవయాత్ర భావితరాల జీవయాత్రలలో భాగం కాకపోవడం. రేత్రులలో బాలగంగాధర్ అమృతం ఇక పై కురవకపోవడం.
తెలుగు చచ్చిపోవడం అంటే - జాషువా గారి గబ్బిలానికి కూడా కనపడనంత అంధకారం లోకి జారుకోవడం. యద్దనపూడి గారి కథావిన్యాసంలేక కకావికలై పోవడమే. ఆలోచింపచేసే, తీక్షణమైన రంగనాయకమ్మగారి విమర్శలకు చరమ గీతం పాడటం.
తెలుగు చచ్చిపోవడం అంటే - చందమామ కథల చల్లని వెన్నెల కరువవడం. పసిపాపల తారంగం తారంగం తారుమారు అవ్వడం. నానమ్మ ఒడిలో పేదరాశి పెద్దమ్మ కథలు కంచికి వెళ్లడం.
తెలుగు చచ్చిపోవడం అంటే - పాంచాలి పంచ భతృక అని గర్జించిన ఎన్టీవోడి వాక్దాటి కి వారధి కట్టడం. జంధ్యాల నవ్వుల సుత్తి నిశ్శబ్దం అవ్వడం. బ్రహ్మాండంకే కడుపుబ్బించే మన బ్రహ్మి కితకితలు లేక నవ్వ లేకపోవడం.
తెలుగు చచ్చిపోవడం అంటే - అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అని ఘంటసాల మాస్టారి రసడోలలలో స్నానం చెయ్యలేక పోవడం. మొదటి చూపులో ప్రేమించిన వయ్యారులు జానకమ్మ ఆసరా తీసుకుని తొలిసారి మిమ్మల్ని అని రాగాలు తీయలేక పోవడం. మొదటి చుంబనంలో తేనె కన్నా తియ్యని గాన గంధర్వుడు బాలు ఊపిరి పోసిన ఓం నమః ఆస్వాదించలేక పోవడం.
రాగారాగిణి వంటి సూక్ష్మమైన నాటికలతో తెలుగు రంగస్థలానికే వన్నెపూసిన గొల్లపూడిగారి తెలుగు సమయతిమిరంలో అస్తమించవలిసిందేనా? భగ్న ప్రేమికులు ఇంక ప్రేమ లేదని ప్రేమించరాదని అని మనసుకవి కలము లో బాలు కంఠం తో విలపించరా? పాతుకు పోయిన ఆచారాల్ని ఎదిరిస్తూ వేటూరి సూటి మాటల ఆసరాతో శంకర శాస్త్రిని, శంకరా అని ఎలుగెత్తి మొరపెట్టించిన విశ్వనాధుని తెలుగు అంతరించి పోవాలిసిందేనా? ఆది భిక్షువు వాడినేమి కోరేది బూడిదిచ్చే వాడిని ఏమి అడిగేది అని సరళ తెలుగు లోమన గుండెల్లోకి చొచ్చుకుపోయి, నిగ్గదీసి అడుగు అని వెన్ను తట్టి కర్తవ్యం గుర్తు చేసి తెలుగు సిరులు మనకి తోడిపెట్టిన సీతారామయ్య తెలుగు సమసిపోవలసిందేనా?
మా తాతలు నెయ్యి తిన్నారు మీరు మూతులు నాకండి అంటే భాష బ్రతకదు. మా తెలుగు గొప్పది అని పైన ఉదహరించిన రచనలు పాటలు తో అది బ్రతకదు. నవయుగానికి సరిపడే విధంగా తెలుగు నేర్పాలి క్రొత్త రచయతలు రచనలు రావాలి. ఇది ఇవాల్టి గురించి కాదు. ఈవాళ చంద్రబోస్, అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్ మరియుఇంకెందరో తెలుగు కేతనాన్నిఅద్భుత సామర్ధ్యంతో తమ భుజస్కందాలపై ఎగరవేస్తున్నారు. కానీ ఇప్పటి నుంచి నలభై సంవత్సరాల్లో తెలుగు పుస్తకాలు రావాలంటే ఈనాటి ప్రాధమిక విద్యార్థి తెలుగు నేర్చుకోవాలి. భాష మీద అభిమానం పెంచుకోవాలి. బాహ్య ప్రపంచం లో అది వాడగలగాలి. ఆవేశం, ఆనందం, ఆర్ద్రత, జాలి, దుఃఖం కలిగినప్పుడు మనసు చలిస్తే వాళ్ళ యద లోంచి తెలుగు జాలువారాలి. కానీ ఈనాడు అటు బడి లో గాని ఇటు ఇంట్లోగానీ మనం వారికీ వాతావరణం కలగచెయ్యట్లేదు. ఇది ఒక్క ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. సభ్య సమాజం అందరిదీ.
ఎంత మంది తల్లిదండ్రులు తెలుగు పుస్తకాలు కొంటున్నారు. ఎంతమంది వాటిని చదువుతున్నారు. ఎంత మంది వాళ్ళ పిల్లలకి తెలిసేలా వాళ్ళ ముందు వాళ్లతో కలిసి చదువుతున్నారు? తెలుగులో మాట్లాడమని, చదవమని, రాయమని ప్రోత్సహిస్తున్నారా ? అపార్ట్మెంట్ లో, వీధిలో పండగలు వేడుకలు జరిపేట్టప్పుడు వేమన పద్యాల పోటీ, తెలుగు నాటకాల సందడి, కథా కాలక్షేపం, కార్టూన్ల సమరం, వక్తృత్వం లేక వ్యాసరచన కూడా నిర్వహిస్తే ఇలాంటివి కూడా ఉంటాయి అని ముందు తరానికి తెలుస్తాయి. వారిలో ఎంతో కొంతమంది వాటి వల్ల ప్రేరేపితులై రేపు ఇంకో సిరివెన్నెలో శ్రీశ్రీయో అయ్యే అవకాశం ఉంది. అలాగే అన్ని బడులు కూడా చేస్తే మన వంతు కృషి చేసినవాళ్లు అవుతాము.
తెలుగు ప్రస్తుత పరిస్థితి కి మూలం ఆంగ్లమాధ్యమంలో విద్యా బోధనే అని వేరే చెప్పే అవసరం లేదు. ఆరవ తరగతి దాకాఅందరికీ , ప్రభుత్వ మరియు ప్రైవేటు బడులలో, తెలుగు లోనే విద్యా బోధన జరిగేటట్టు చట్టం అమలు చేయడం పై పెద్దలు, ప్రభుత్వం నిపుణుల సహాయం తో ఎంతైనా తర్జనభర్జన చేసి నిర్ణయం తీసుకోవాలి.లేకపోతే మన మాతృభాష కి తిలోదకాలు వదులుకోవలసినదే.
భాష ఒక్క మాట్లాడుకునే పనిముట్టు కాదు. ఒక సంఘం, ఒక సాంస్కృతిక సమూహం తరతరాల తమ గుర్తులను, ఆలోచనలను, సాంప్రదాయాలను, విజ్ఞానముని, స్మారక స్థితిని భాషలో నిక్షిప్తం చేస్తాయి. ఇది మన అమూల్యమైన సంపద. కాదు కాదు, ఇది రాబోయే తరాలకు అందచేయడానికి మన రక్షణలో ఉంచిన జ్ఞానవాపి. రండి తెలుగు మాట్లాడుదాం, చదువుదాం , వ్రాద్దాం, నేర్పిద్దాం, ఈ సంపదని పెంపొద్దిద్దాం, పంచుదాం నిలుపుదాం.
బాగుందండీ 👏👏👏👌👌👌
ReplyDelete🙏
Delete