Posts

Showing posts from April, 2025

మేరు

  ఐరిష్ కవి  విలియం బట్లర్ యేట్స్ (1865 - 1939) రచించిన కవిత    మేరు (1934)   కి స్వేచ్ఛానువాదం...        నాగరికత పెనవేసుకు పోయింది, లోబడి     ఒక శాసనానికి, శాంతి అనే ఓ ఆకృతికి,     వన్నె వన్నెగా భిన్న భిన్నంగా అల్లుకుపోయిన మాయకి; తలపుల వడి     మనిషి జీవితం, భయంతో భీతిల్లినా మనిషి ఆపలేడు     మారణహోమం, యేళ్లు శతాబ్దాలు అయినా  శతాబ్దాలు యుగాలైనా     శమించని ఆకలితో ప్రళయ తాండవం చేస్తో, సర్వ విధ్వంసం కావిస్తో వచ్చేది     ఎడారి వంటి వినాశనమైన వాస్తవంలోకే:     ఈజిప్టు మరియు గ్రీకు రాజ్యాలకు వీడ్కోలు, వీడ్కోలు రోమ్ మహాసామ్రాజ్యానికి.     ఋషులు మేరు పర్వతం పైన, యోగులు హిమాలయాల్లో     మంచు కప్పిన ఆ గుహల్లో, ఎముకలు కొరికే శీతాకాలపు హిమ పాతం     తమ నగ్న శరీరాలను చాకుల్లా తాకుతున్నా, వారికీ తెలుసు     పగటి వెంబడే చీకటి వస్తుందని, ఉషోదయానికి ముందే     మనిషి యొక్క ప్రశస్తి మనిషి కట్టిన సౌధాలు తృటిలో బూడిదై పోతాయని.