మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు

 

కైఫీ అజ్మి రచించిన Aurat కి స్వేచ్ఛానువాదం... 


మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు

యుద్ధ జ్వాలలు రగులుతున్నాయి ప్రపంచంలో నేడు

నుదుటి రాతలూ, కాలం పరుగులు, కలిసి పంచుకున్నాయి ఒకే ఆశలు నేడు

మదిర పాత్రలో మధువు మరుగుతోంది అగ్నిపర్వతంలా నేడు

సౌందర్యము ప్రేమము ఒకే ప్రాణం ఒకే ఆత్మ అయ్యే నేడు


ఏ అగ్ని జ్వాలలలో నేను తప్తమవుతున్నానో తప్తమవ్వాలి నువ్వు

మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు


జీవితం పోరాటంలో ఉంది, ఓర్పుల నిగ్రహంలో కాదు

పరవళ్లు తొక్కే బ్రతుకు రక్తంలో ఉంది, బెదిరిన కన్నీటిలో కాదు

చేతులు చాచి ఎగరడంలో గుబాళింపు ఉంది, నీ నల్లని కురులలో కాదు

స్వర్గం వేరొకటి ఉంది, మగని పక్కన కాదు


ఆ స్వతంత్రపు వీధులలో స్వేచ్ఛగా విహరించాలి నువ్వు

మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు


దిక్కు దిక్కునా చితాగ్నులు మండుతున్నాయి నీ కోసం

కర్తవ్యం అన్న ముసుగులో మృత్యువు మసులుతోంది నీ కోసం

దయతో కోమలంగా నువ్వు చేసే పనులన్నీ, అవుతాయి శాపం నీ కోసం

కాలకూటపు విషం, అవుతాయి ప్రపంచపు గాలులు నీ కోసం


ఋతువునే మార్చేయ్యి, ఎదగాలంటే విప్పరాలంటే నువ్వు

మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు


విలువ ఇప్పటిదాకా నీది, చరిత్ర ఇంకా తెలుసుకున్నదే కాదు

నీలో నివురుగప్పిన నిప్పు కూడా ఉంది, ఉత్త కన్నీటి ధారలే కాదు

నువ్వు మసకబారని నిజానివి, కేవలం అందమైన కథే కాదు

నీ మొత్తం వ్యక్తిత్వం ఒక ప్రత్యేకత, ఒక్క నీ యవ్వనమే కాదు


నీ చరిత్ర యొక్క శీర్షిక మార్చాలి నువ్వు

మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు


తరతరాల కట్టుబాటలు తెంచుకు రా, ఆచారాల బండలు బ్రద్దల కొట్టుకు రా

సుఖాల ఎండమావి మాపుకు రా, బలహీనతల ముసుగు మసిచేసి రా

నీ గొప్పతనానికి నువ్వే గీసుకున్న నీ బరి, తెగించి ముందుకి దూకి రా

ఇదీ ఒక బందిఖానానే, ఈ ప్రేమ సంకెళ్లు ఖండించి రా


ఈ బాటలో ముళ్ళనే కాదు, పూలని కూడా తొక్కి రావాలి నువ్వు

మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు


ప్రవచనమనే పేరుతో తిరిగి నీ సంకల్పాన్ని నీరు కార్చే భాషణాల్ని ఖండఖండాలు చేయ్

నీ కాళ్లు కట్టిపడేసిన ఆ బాసలు ఆ గొలుసులు తెంచేయ్

ఈ హారం ఈ పచ్చల కంఠాభరణం దాన్ని కూడా తీసేయ్

ఈ స్మృతులు ఈ ధర్మాలు మగవారు పెట్టిన ప్రమాణాలు జవదాటి వచ్చేయ్


సుడి గాలియై వేగంగా తొర్లాలి నువ్వు, వడగాలిగా ఉడికిపోవాలి నువ్వు

మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు


నువ్వు అరిస్టాటిల్ తర్కానివి, నువ్వు సౌందర్య దేవత భాస్వరం

అనంతాకాశం నీ అధీనం, భూమండలం నీ పాదాక్రాంతం

ఆహా, ఎత్తు, వడి వడిగా ఎత్తు, విధి అడుగుల మడుగులు నుంచి నీ లలాటం

ఆగను నేను, ఆగదు సమయం


కొట్టుమిట్టాడతావు ఇంకెన్నాళ్లు, ధృడ నిశ్చయంతో సాగాలి ఇక నువ్వు

మేలుకో నేస్తమా! నాతో కదిలి రావాలి నువ్వు


Comments

Popular posts from this blog

సుదీర్ఘ యానం

వేలకొద్ది ఆశలు అలాటివి

మట్టి