మట్టి
టి ఎస్ ఎలియట్ (1888 - 1965) రచించిన కవిత ది రాక్ (1934) కి స్వేచ్ఛానువాదం...
గగన సీమలలో పక్షిరాజు పైకెగిసింది
వేటగాడు జాగిలాలతో పాటు సంచారం చేస్తున్నాడు
ఓ చుక్కల నిత్య భ్రమణమా
ఓ ఋతువుల నిర్ధేశిత పునరావృతమా
ఓ వసంత శిశిరాల, జనన మరణాల ప్రపంచమా
అంతులేని వలయం ఈ తలపు ఈ కర్మ,
అంతులేని కల్పన, అంతులేని శోధన, తెస్తాయి
ఎరుక చలనాల గూర్చి, కానీ అందదు నిశ్చలత్వం
ఇస్తాయి వాగ్విద్య, కానీ వినబడదు నిశ్శబ్దంలో నిర్దేశం
మాటల అర్థం అందుతుంది, కానీ శృతి తెలియని అజ్ఞానం మిగులుస్తుంది
మన విషయ జ్ఞానం మనల్ని మరింత దరికి చేరుస్తుంది అజ్ఞానానికి
మన అజ్ఞానం మరలుస్తుంది మర్త్యుని దగ్గరకు
మృత్యువు వడి లోకేగాని, బ్రహ్మైక్య ఆనందంలోకి కాదు.
ఎక్కడా జీవితం బ్రతకడంలో ఖర్చు అయిపోయినది ?
ఎక్కడ ఆ వివేకం, శాస్త్ర పరిజ్ఞానంలో కోల్పోయినది ?
ఎక్కడ ఆ పరిజ్ఞానం, సమాచారాల చిట్టాలో చిక్కుబడినది ?
వేల సంవత్సరాల ఆకాశ పరిభ్రమణాలు
త్రోసాయి పరబ్రహ్మ నుంచి దూరంగా, మట్టికి దగ్గరగా!
Comments
Post a Comment