ఊపిరి
బెకీ హెంస్లీ Breathe కి స్వేచ్ఛానువాదం...
మరుగున ఉంటే నీకు బిడియమన్నారు
ముందుకు వస్తే నీకు గర్వమన్నారు
అడుగుతారు దారి కానీ విని తల దూర్చకన్నారు
నీ గొంతు పెద్దదన్నారు కానీ గమ్మునుంటే నివ్వెరపోయారు
లేదు వాంఛ అంటే అయ్యో పాపం అన్నారు
కలలు పంచుకుంటే పిచ్చిదానివన్నారు
చెప్పు వింటామన్నారు విని చెవులు మూసుకున్నారు
భయమంటే హత్తుకున్నారు వెనుతిరిగి ఫక్కున నవ్వుకున్నారు
అన్న మాటలన్నీ విన్నది, విన్న చిన్నది తాననుకున్నది
వాళ్ళు గీసిన అమ్మాయవ్వాలని, ఆ ఉత్తమ స్త్రీ వారనుకున్నది
ఒకనాటి మహోదయాన గుండెసవ్వడి అడిగింది నాకేది శ్రేష్ఠమని
చాలు చెలి ఇక సంతృప్తి పరచడం మరి అందరిని
వేగిరమే పయనమై కానలకి, చెట్ల నడిలో నుంచుంది
ఆకులతో చిరుగాలి గుసగుసలు వింది రెపరెపలాడే కేళి చూసింది
మద్దితో మాట్లాడింది కదళితో కబుర్లాడింది పున్నాగని పలకరించింది
ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి వసంతం ప్రతి శిశిరం అందరూ చెప్పిన నిర్దేశాలు వినిపించింది
జీవితాన ప్రతీ క్షణాన నాలో ఎపుడూ లేమి నాలోనే ఎదో లోపం
నా ఉనికి ఒకరికి మరీ తక్కువ లేకపోతే అంతెందుకు మరీ ఎక్కువ
ఒకసారి స్థాయి ఎక్కువ కాకపోతే మౌనం పెక్కువ, ఎందుకంత ఆవేశం, లేదా నీకు పౌరుషం
తెలివి మితి మీరెనో కాదు కాదు బుద్ధి హీనమో, అంత గడుసెందుకో ఇంత భయమెందుకో
అప్పుడా వటవృక్షాల మధ్యలో గగన వీధుల నుంచి జాలువారిని కాంతి పుంజాల నేల కనపడింది
ఆమె తన పథంలో ఆగింది...ఆ తరువులు తనని తట్టి చెప్పే భాషలు వింది
గంటల క్రొద్ది అక్కడే కూచుంది, వదిలి వెళ్లడం ఇష్టంలేక ఉండి పోయింది
ఎందుకంటే ఆ అడవి ఆమెకు ఏమీ చెప్పలేదు ఏమీ నిర్దేశించలేదు, ఆమె ఊపిరిలో తానైంది ఒకటైంది.
-- పవన్ చిట్టాప్రగడ ( బెకీ హెంస్లీ ఆంగ్ల పద్యానికి స్వేచ్ఛానువాదం)
Comments
Post a Comment