నెయ్యములల్లో నేరేళ్ళో

నెయ్యములల్లో నేరేళ్ళో 

-- అన్నమాచార్య కీర్తన 

-- క్రింద తాత్పర్యంలో తప్పులు ఉంటే క్షమించి తప్పు సవరించగలరు.

 పల్లవి:

నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన వూరెడి వువ్విళ్ళో

చరణములు:
పలచని చెమటల బాహుమూలముల
చెలమలలోనాఁ జెలువములే
థళథళమను ముత్యపుఁ జెఱఁగు సురటి
దులిపేటి నీళ్ళ తుంపుళ్ళో

తొటతొటఁ గన్నులఁ దొరిగేటి నీళ్ళ
చిటి పొటి యలుకల చిరునగవే
వట ఫలంబు నీ వన్నెల మోవికి
గుటకల లోనా గుగ్గిళ్ళో

గరగరికల వేంకటపతి కౌఁగిట
పరిమళములలో బచ్చనలు (లే)
మరునివింటి కమ్మనియంప విరుల
గురితాఁకు లినుప గుగ్గిళ్ళో

కష్టమైనా పదాలకు అర్ధాలు:

నెయ్యము = స్నేహము, ప్రేమ, ఇంపు
అల్లో నేరేళ్ళు = కాముని పున్నమికి స్త్రీలు ఆడే కోలాటం
ఒయ్యన = నెమ్మదిగా, వయ్యారంగా 
చెలమ = ఊట; తవ్వబడిన పల్లము
చెలువము = అందము
చెరగు = అంచు; కొంగు
సురటి = విసిన కఱ్ఱ
తొరుగు = ప్రవహించు; కారు; పడు
నగవు = నవ్వు
వట = మఱ్ఱి చెట్టు
వన్నె = రంగు, అందము
మోవి = పెదవి
గరగరికల = చక్కదనం; అందం
బచ్చన = పూత; పూయడం
మరుడు = మన్మథుడు
వింటి = విల్లు
కమ్మని = ఆహ్లాదకరమైన; తీపి
అంప = బాణము
విరి = పుష్పము; వికసించినది

తాత్పర్యము

అన్నమయ్య ఊహించిన గొప్ప శృంగార దృశ్యం ఇది. పద్మావతీ అమ్మవారి స్నేహితురాండ్రు లేక చెలికత్తెలు ఆమెను ఆట పట్టిస్తున్నట్లుగా ఉహించవచ్చును. 

కాముని పున్నమికి అల్లో నేరేళ్ళు అనే కోలాటం ఇంపుగా వయ్యారంగా ఆడుతూ స్వామివారి సాన్నిధ్యం కోసం ఉవ్విళ్ళు ఊరుతోందిట అమ్మవారు.

ఆ విరహ వేదనలో చిరు చెమటలు ఆమె బాహు మూలములలో (చంకలు) ఊట ఊరినట్లు వచ్చి ఎంతో అందంగా ఉందట. ఆ వేడి నుంచి ఉపశమనం కోసం గాలి కొరకై ముత్యాల కొంగుతో విసిన కఱ్ఱ ఆవిడ విసురుకుంటే ఆ స్వేద బిందువులు తుంపర లాగా పడుతున్నాయి అని కవ్విస్తున్నారు.

చిన్న చిన్న అలకలతో కంట్లోంచి బొటాబొటి నీళ్లు కారగా శ్రీవారి చిరు నవ్వే అమ్మవారి సుందరమైన పెదాలకి మఱ్ఱి చెట్టు పండు లాగా ఎర్రటి రంగు తెచ్చి పెట్టాయి. ఆవిడకి, వట ఫలము లాగ ఉన్న శ్రీవారి చిరునవ్వు చిందించే పెదాలు అందుకోవాలని గుటకలు వేయించాయి.

అతి సుందరమైన వేంకటపతి కౌగిట్లో బంధించ పడిన ఆవిడకి అయన శరీరానికి పూసిన పరిమళాలు మన్మథుని విల్లు నుంచి వెలువడిన పూల బాణాల వలే తాకి ఆ తాపానికి ఇనుప గుగ్గిళ్ళు తాకినట్లు సిగ్గుతో ఎర్రగా కందిపోయింది.

Comments

Popular posts from this blog

సుదీర్ఘ యానం

ఊపిరి

కాంత - అన్యాక్రాంత - కౌంతేయ