బిమల్ రాయ్
బిమల్ రాయ్
("ప్రత్యక్షంగా...వారిని కలిసాను", గుల్జార్ గుర్తులు నుండి అనువాదం)
నిజం చెప్పాలంటే పంజాబీ కుటుంబంలో పుట్టినా నేను పంజాబీను ఎంతో బెంగాలీను కూడా అంతే. ఎనిమిదో తరగతిలో ఉండగా ఠాగోర్ నన్ను ఆవహించాడు, కాదు కాదు నేనే ఆయన్ని పెనవేసుకున్నాను. అప్పటినుంచి ఖచ్చితంగా చెప్పలేను బెంగాలీ నాలో ఇమిడిపోయిందో లేక నేను బెంగాలీలో మునిగిపోయానో. పదోతరగతి అయ్యేప్పటికి ఠాగోర్, శరత్ చంద్ర చట్టోపాధ్యాయ, బంకించంద్ర చట్టోపాధ్యాయ సాహిత్యం ఉర్దూ అనువాదంలో పరిచయం అయ్యింది. బెంగాలీ స్నేహితులు బడిలో సంభాషించుకోవడం విని నేనూ నేర్చుకోవాలని ఉవ్విళ్లూరాను. నేర్చుకున్నాను. తోడుగా సాహిత్య పఠనంలో అడుగులు వేస్తూవచ్చాను. షుమారు ఈ కాలంలోనే అనుకుంటా రచయత అవ్వాలనే కోరిక నాలో నాటుకో సాగింది. సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఉండగా ముంబాయి (అప్పట్లో బొంబాయి) లో ఉన్న మా పెద్ద అన్నయ్య దగ్గరకి నన్ను పంపించారు. బహుశా జీవితం పనికిరాని వాటితో వృధా చేయకుండా బ్రతుకుతెరువు నేర్చుకోవడం కోసం పంపించారు అనుకుంటా.
అదే నా యందు ఒక వరమయ్యింది. బొంబాయి వెళ్ళగానే ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ (అభ్యుదయ రచయితల సంఘం) లో, ఇంకా ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (భారతీయ ప్రజా రంగస్థల సంఘం- ఇప్టా) లో చేరాను. వాటి సభ్యులు, వాళ్ళ వ్యాపకాలు, పదునైన బుద్ధి, చురుకైన చర్చలు నాపై ఓ మూలిక పని చేసినట్లు చేసాయి. నా సాహిత్య అభిరుచులు జీర్ణించుకోలేని మా అన్నయ్య ఇంటి నుంచి వెంటనే బయట పడ్డాను. దానితోపాటే పొట్ట కూటి కోసం ఒక మోటార్ గ్యారేజ్లో పనికి చేరాను. అప్పట్లో చార్ బంగ్లా అనే పేటలో ఉండేవాడిని. అప్పుడే అనుకుంటా ఇంకొంతమంది బెంగాలీలు స్నేహితులయ్యారు. బెంగాలీ కవిత్వం మీద మక్కువా పెరిగింది. సమయం దొరికినప్పుడల్లా కిటికీ ప్రక్కనే కూచుని సుభాష్ ముఖోపాధ్యాయ్ కవితలు తర్జుమా చేసేవాడిని.
ఇంతలో దేబు సేన్, ప్రఖ్యాత చలన చిత్ర దర్శకుడు బిమల్ రాయ్ యొక్క సహాయకుడు, అద్దె గదిలో నాతోపాటు చేరాడు. అప్పటికే మేమందరం - దేబు, సలీల్దా, ప్రేమ్ ధావన్, రుమ గుహతాకుర్తా, నేను - ఇప్టా పుణ్యమా అని ఒక వర్గంగా ఉండేవాళ్ళం. దీనికి తోడు నేను అప్పడప్పుడూ రాస్తూ రచయత అవ్వడంకోసం ప్రయాస పడుతూ ఉండేవాడిని.
దేబు సాయంత్రం వచ్చి బిమల్ రాయ్ గురించి కథలు కథలుగా చెప్పేవాడు. ఒకోసారి అతనితో స్టూడియోకి వెళ్లి మూవీయోలా (ఎడిటింగ్ యంత్రం) లో సినిమాలు చూసేవాడిని. బొంబాయిలో ఆ రోజుల్లో బిమల్ రాయ్ పేరు మారు మ్రోగుతూ ఉండేది. నాకు ఆయన చిత్రాలంటే వ్యక్తిగతమైన ఆసక్తి కూడా. ఆయన చిత్రాలు దాదాపుగా అన్నీ బెంగాలీ సాహిత్యం నుంచి పొసగినవే. గ్రంథాల పిచ్చి ఉన్న నాకు దాని కారణంగా ఆయనంటే ఇంకొంచం గౌరవం ఉంది. ఒకరోజు దేబు "పద నిన్ను రేపు ఆయన దగ్గరకి తీసుకెళ్తాను" అన్నాడు. మొదట్లో ఎగిరి గంతేసినా, కొంచం ఆలోచించాక ససేమిరా అన్నాను. "లేదు నేను రాను, సినిమాల్లో పని చేయాలని లేనప్పుడు ఆయన్ని కలిసి ఉపయోగం ఏమిటి? నేను రచయత అవుతాను." అక్కడే ఉన్న, పాటల రచయిత, శైలేంద్ర మెత్తగా తిట్టాడు. "నీ ఉద్దేశం ఏంటి? సినిమాల్లో పని చేసే వాళ్ళందరూ నిరక్షరాస్యులు అనుకున్నావా! కేవలం బిమల్ రాయ్ దగ్గర పని చేయడం కోసం ఝలాని (రాయ్ సహాయకుడు) బెంగాలీ నేర్చుకుంటున్నాడు, పైచదువులుకూడా చేస్తున్నాడు. నువ్వేమో వడ్డించిన ఇస్తర లాగా అవకాశం వస్తుంటే వద్దంటున్నావు!" దానితో రాయ్ని ఒక పాట రాసే నిమిత్తం వెళ్ళి కలిసాను. ఆ పాట శైలేంద్ర రాయాల్సి ఉంది కానీ ఆయనకు రాయ్కు ఎదో మాట తేడా వచ్చి ఆ అవకాశం నన్ను వరించింది.
అలా వెళ్ళాను. నేను అనుకున్న హంగు ఆర్భాటం లేకపోగా, డాబు దర్పం లేని సాధారణమైన మనిషిగా రాయ్ కనపడ్డారు. ఒక్క క్షణం నాకు నోట మాట రాలేదు. "బిమల్దా, నా స్నేహితుడు గుల్జార్" అంటూ దేబు పరిచయం చేసాడు. "హుమ్" వచ్చింది సమాధానం. బిమల్దా 'హుమ్' అంటే అందరికీ తెలిసిందే! దాన్ని ఎలాంటి భావంలోనూ - కోపం, వాత్సల్యం, విసుగు, బాధ లేక ఆందోళన - లోను వాడచ్చు. ఆ "హుమ్' ని భేరీజు వేసుకునే మేము ఏమి చెయ్యాలో నిశ్చయించుకునే వాళ్ళం. దానిని అర్థం చేసుకోడం ఎంత కష్టతరమైందో! కానీ ఆయన గురించి బాగా తెలిసినవాళ్ళు దాని అర్థం ఇట్టే పసిగడతారు. "హుమ్" తర్వాత అయన బెంగాలీలో దేబుని అడిగారు, "ఇతను వైష్ణవ కవిత్వం అర్థం చేసుకుని రాయగలడా?". "బిమల్ దా, గుల్జార్ బెంగాలీ అర్థం చేసుకోగలడు, మాట్లాడగలడు కూడా." అయన మొహం సిగ్గుతో ఎర్రబారిపోయింది. ఆ సన్నివేశం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆయన చాలా సార్లు అలా ఎర్రబారి పోయేవారనిపిస్తోంది.
"బెంగాలీ ఎలా నేర్చుకున్నావు" అని అడిగాడు.
"ముందు స్నేహితులనుంచి ఆ తరవాత నేను స్వయంగా చదువుకున్నాను"
"చదవగలవా?"
చదవగలనూ, కొంచం వ్రాయగలనూ కూడా".
"కాబూలీవాలా చదివావా?".
"చదివేను," సమాధానం ఇచ్చాను. "ముందు ఉర్దూలో తర్వాత ఆంగ్లంలో ఆపైన బెంగాలీలో."
నేను ఆయన చిత్రానికి పాట రాస్తానని అక్కడే నిర్ణయించారు.
ఒకరోజు సచిన్దా, బిమల్దా, నేనూ చర్చించడం కోసం కలిసాం. బిమల్దా వివరిస్తూ ఉన్నాడు - "చూసారుగా, ఆ అమ్మాయి ఇల్లు వదిలి ఎక్కడికీ వెళ్ళదు. ఎంతోమంది ఆమె తండ్రిని చూడటానికి వస్తూవుంటారు. వైష్ణవ సాహిత్యం చదువుతారు ఆ సత్సంగంలో. ఆ పాటలు విని ఆమె చాలా ప్రభావితమవుతుంది." ఇంతలో సచిన్దా ఆవేశంగా అడ్డుకుని, "ఏమి చెప్తున్నావు నువ్వు? ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వెళ్లకపోతే ఎలా కుదురుతుంది? నేను స్వరపరచిన సంగీతం బయటకు వెళ్లకపోతే సరిపడదు. లేదు. ఆమెను నువ్వు బయటకు పంపాల్సిందే!" మేము నివ్వెర పోయాము. సచిన్దా, సంగీత దర్శకుడు అయ్యి ఉండి, సినిమాలో ఓకే పాత్ర గురించి మాట్లాడుతున్నాడు. బయటకు పంపాల్సిందే అని దర్శకుడితో పట్టు పడుతున్నాడు. కానీ బీమల్దా ఆమెను పంపడు. సచ్చిందా పంపమంటుంటే, బిమల్దా "ఏమంటున్నారు కోర్త (బెంగాలీలో గౌరవర్థకం)! నా పాత్రని బయటకు పంపాలా?!" ఇంక సచ్చిందాకి కొద్దిగా కోపం వచ్చింది. "అలాగైతే సలీల్ (చౌదరి) నే బాణి కట్టమను నీ చిత్రానికి." అప్పటికే బిమల్దా నవ్వు ఆపుకుంటూ ఉన్నాడు. పౌల్ మహేంద్ర, ఆ సినిమా కథకుల్లో ఒకడు, మెత్తగా అన్నాడు, "బిమల్దా, ఆ పిల్ల తండ్రి ముందు ప్రేమ గీతం ఎలా పాడుతుంది చెప్పండి?" సచ్చిందా ఒక్కసారిగా చప్పట్లు చరిచి, "అద్గది"! తన వైపు మాట్లాడేందుకు ఒకడు దొరికాడు. అదిగో చూసావా,ఇద్దరు ఉద్ధండులు పాట సన్నివేశం గురించి వాదులాడుకుంటున్నారు. మేం చిన్నవాళ్ళం అబ్బురంగా చూస్తుండిపోయాం. ఇలా మనకు చిన్నగా కనిపిచ్చే అంశాలపై వారి దీక్ష నిజంగా నేర్చుకోదగ్గదే. ఆ పాటే మోర గోర ఆంగ్ లెయ్ లే...(నా ధవళ రంగు తీసేసుకో). బందిని చిత్రం కోసం రాసాను. నూతన్ మీద చిత్రించబడింది.
పాటలు చిత్రీకరించడంలో తనకు అంత ప్రావీణ్యం లేదనుకునేవాడు బీమల్దా. అందుకని ఆ సన్నివేశాల్లో ప్రతీ చిన్న అంశాన్ని నిశితమైన దృష్టితో చూసి అత్యద్భుతంగా వచ్చేటట్లు చేసేవారు. పాట మధ్యలో సంగీత కూర్పు మారినా లేక క్రొత్తది మొదలైనా, వెంటనే "షాట్ మార్చు. వాయిద్యం కానీ లయగాని ఒకే షాట్లో ఎలా మారతాయి?" మొదటిగా ఆయన సినిమాల్లోనే సౌండ్స్కేప్స్ (ధ్వని దృశ్యం) వాడారు. గంట మ్రోగడం, కుక్క మొరగడం, పాటలో వినపడే ప్రతీ శబ్ధం బీమల్దా సౌండ్స్కేప్లో బంధించబడ్డవే. పూర్తిగా చలన చిత్రాల చుట్టూనే జీవితం పరిభ్రమించే మనిషి ఆయన; ఆయన ప్రతి శ్వాసలో సినిమా ఆయన జీవనమే సినిమా.
ఒకసారి మేము చాలా రోజులు రెండు షిఫ్టులు పని చేయాల్సి వచ్చింది. ఒక రోజు రాత్రి పదింటికి పని అయ్యింది. ఇంటికి బయలుదేరే ప్రయత్నంలో ఉండగా, బీమల్దా సంకలనకర్త(ఎడిటర్) అయిన మధుకర్ ని పిలిచి "సరే, ఇప్పుడు నువ్వెళ్ళి ట్రాక్స్ సిద్ధం చెయ్యి" అని పురమాయించాడు. మధుకర్ ఒళ్ళు చిర్రెత్తుకు పోయింది. ఆయన ముందు ఏమీ అనే సాహసం చేయలేదు అనుకో. అయినా విసుగ్గా సణుగుతోనే ఉన్నాడు - "ఈ మనిషికి కుటుంబ జీవనం లేదు, ఇంకోళ్ళకి ఉండనివ్వడు. నా భార్యకి ముందే చెప్పి ఉండల్సింది. నన్ను పెళ్లి చేసుకోకు, నేను బిమల్దా అసిస్టెంట్ అని." ఇంతలో బిమల్దా తనదైన రీతిలో "గొల్జార్" అని బెంగాలీ పద్ధతిలో పిలిచి "నువ్వు మధుకర్తో ఉండి సహాయం చెయ్యి" అన్నాడు. ముఖాలు వేలాడేసుకుని గత్యంతరం లేక పని కొనసాగించాము. రాత్రి రెండింటికి ఎడిటింగ్ గదిలో ఫోన్ మ్రోగింది. అవతల ప్రక్క నుంచి అత్యుత్సాహంగా బిమల్దా గొంతు వినపడింది - 'ట్రాక్లో బల్లి శబ్ధం వచ్చిన చోట ఖాళీ వదిలెయ్యండి. బల్లి కిచకిచలు ఇప్పుడే రికార్డు చేశాను, రేపు దానిని అతికిద్దాం. అద్భుతంగా వచ్చింది.'. కేవలం మేమిద్దరమే రెండువిడతల పని చేయట్లేదు, దా కూడా పనిలో అంతర్లీనమై ఉన్నాడు. ఆయనకి చిత్రాలే బ్రతుకు, ఊపిరి.
మా నాన్నగారు కాలంచేసినపుడు, నేను ఒక సినిమా పనిలో మునిగిపోయి ఉన్నాను. నాకు ఆ వార్త కూడా సమయానికి చేరలేదు. నాలుగు రోజులు అయ్యాక ఢిల్లీ లో ఇంటి పొరుగు వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాన్నగారి ఆఖరి కర్మలకు నేను రాక పోడంతో 'తండ్రి కర్మకాండలకు రాకుండా ఉండడే' అని వాళ్ళు కబురు పంపించారు.ఉత్తరం చదివినపుడు నన్ను లోపల్నుంచి ఎవరో చీల్చి వేసినట్లు కోపం, బాధ, దుఃఖం కలిగాయి.నా కుటుంబంలో ఎవ్వరూ నాకు చెప్పలేదు. బిమల్దా దగ్గరకి వెళ్ళాను. తన మేనేజర్ తో చెప్పి వెంటనే ఢిల్లీకి టిక్కెట్లు తెప్పించారు. అక్కడికి వెళ్లి వారి వ్యధని అందరితో పంచుకున్నాను. కానీ నాన్న ఇక లేడు. మా వాళ్ళు చేసిన దానికి నాకు కలిగిన బాధ మాత్రం పోలేదు. బొంబాయి తిరిగి వచ్చి నన్ను నేను పనిలో ముంచేసుకున్నాను. గుండెలో ఏడ్పు సద్దుమణిగినా ఒక పెద్ద బుడగలాగా ఒక మూల మిగిలిపోయింది.
పనిలో అందరితో పాటు నవ్వడం, నవ్వించడం తిట్లు తినడం పరిపాటి అయిపొయింది. బిమల్దా యొక్క ప్రభావం నామీద పెరుగుతూ వచ్చింది. ఎక్కడో అది నాకు తృప్తి, నాకూ ఎవరో ఉన్నారు అనే భరోసా ఇచ్చింది. ఆయన ప్రవర్తనలో పైకి కనపడకపోయినా మా ఇద్దరి మధ్య ఎదో కనపడని అనుబంధం. దానికి ఒక కారణం రచయత కావాలన్న నా తపన, ఇంకోటి బెంగాలీ సాహిత్యం మీద నా మక్కువ. ఇంతలో నా చెల్లెలి పెళ్లి నిశ్చయం అయ్యింది. దాదా దగ్గరకి వెళ్లి రెండు రోజులు సెలవడిగాను. 'హుమ్, వెళ్లి ఎడిటింగ్ పని చూడు' అన్నాడు. తప్పక అదే చేశాను. కొన్నాళ్ళయ్యాక మళ్ళీ అడిగాను. ఈసారి 'హుమ్, వెళ్లి సౌండ్ ఎఫెక్ట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూడు' అన్నాడు. పాలిపోయిన మొహంతో అలాగే ఆ పని చేశాను. ఇంతలో బిమల్దా ముఖ్య అనుచరుడు ఝలాని తన పెళ్ళికి శెలవు కావాలని అర్జీ పెట్టాడు. దానికీ 'హుమ్' అనే సమాధానం! ఒక రోజు ఝలాని పెట్టె పుచ్చుకుని ఎదురు పడ్డాడు. "అదేంటి సెలవు మంజూరు అవ్వలేదు కదా?!". 'బాబూ ఇది నా పెళ్లి, నీలాగా చెల్లి పెళ్లి కాదు. బిమల్దా హుంలు వింటూ కూచుంటే ఇంక నా పెళ్లి అయినట్లే. నేను పోతున్నాను.'
ఇవన్నీ ఆలోచిస్తూ పని చేస్తూ పోయాను. చెల్లి పెళ్ళికి ఒక రోజు ముందు బిమల్దా నన్ను పిలిచి, నాకు ఢిల్లీ కి విమానం టిక్కెట్లు తెమ్మని మేనేజర్కి పురమాయించారు. 'గొల్జార్, తంతులయిన రెండు రోజులకే వచ్చేయాలి సరేనా? ఇక్కడ చాలా పని ఉంది.' నేను విస్తుపోయాను, చలించిపోయాను.నేను నిజంగా ఆయనకు అంత కావలసినవాడినా. విమానం టిక్కెట్లా! ఇది పంతొమ్మిది వందల అరవయుల్లో గుర్తుంచుకోండి!
పెళ్లి అవ్వగానే వెంటనే బొంబాయి వచ్చేసి పనిలో పడ్డాను. మిగతా పనులతో పాటుగా బిమల్దా, నేనూ వేరొక ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టాము: అమృతాకుమ్భేర్ సంధానే (The quest for the fountain of youth) పుస్తకం ఆధారంగా స్క్రిప్ట్ వ్రాయడం. కథ పకడ్బందీగా ఉండటం కోసం ఆ పుస్తకాన్ని పలుమార్లు చదివించారు. ఎంత రాసామో అంత కంటే ఎక్కువ చర్చించే వాళ్ళము, వాదులాడే వాళ్ళము. బిమల్దా పుస్తకం అంచుల మీద లెక్కలేనన్ని వ్యాఖ్యనాలు రాసారు. అవన్నీ వాడి కొత్త పుస్తకమే రాసేయచ్చు. అవికాక వేరే కాగితాల్లో రాసుకున్న టీకాలు, సంగ్రహాలు, ఆలోచనలు. పుస్తకం వేరొక పుస్తకాన్ని గర్భస్తం చేసుకుని ఉందని కవ్వించే వాడిని. ఒకరోజు కథ చర్చిస్తూ ఇద్దరికీ నచ్చని అంశం వచ్చింది. బలరాం అనే పాత్ర మేళాలో మొదటి రోజునే చనిపోతాడు. ఆయనకి అది నచ్చలేదు.'ఇది ఎలా సరిపోతుంది గొల్జర్? అభ్యంగన స్నానం ఎనిమిదవ రోజు. మొదటి రోజే బలరాం మరణిస్తే కథలో పటుత్వం ఉండదు.' నేను ఇచ్చిన సూచనలేవి ఆయనకి నచ్చలేదు. అదే సమయంలో ఆషాపూర్ణాదేవి నవల ఆధారంగా సహారా అనే సినిమా తీయడం మొదలు పెట్టాం. అది అయ్యాక, 1966 పూర్ణ కుంభ మేళాలో అమృతాకుమ్భేర్ సంధానే మొదలు పెట్టాలని నిర్ణయించారు. సహారా నిర్మాణం జరుగుతుండగా మాకు అంతా వివరించి బిమల్దా కిందకి వెళ్లారు.
కెమరామెన్ కమల్ బోస్ షాట్ సిద్ధం చేసాక దాదాని పిలవడం కోసం నేను కిందకి వెళ్ళాను. 'దాదా షాట్ రెడీ' అన్నాను. తల వంచుకుని ఉన్న ఆయన అలాగే ఉండి 'కమల్ ని షాట్ తీయమను' అన్నారు. ఒక్కసారిగా దిగ్బ్రాంతి చెందాను. ఏమవుతుంది. ఒక్క షాట్ కూడా వదలని ఆయన ఇంకెవరినో తియ్యమంటున్నారా! మరమనిషి లాగా పైకి వచ్చి కమల్దాతో చెప్పాను. ఆయన తన చెవులను తానే నమ్మలేక పోయాడు.స్వయానా తానే వెళ్లి అడిగాడు. మళ్ళీ అదే సమాధానం. అందరం గమ్మున ఉండిపోయాం. నా తల మీద కనపడని చురకత్తి ఎవరో వేలాడేసినట్లు నా ఒళ్ళు చల్లబడిపోయింది. కమల్దా షాట్ మొదలు పెట్టాడు. షర్మిలా టాగోర్ ఆ సన్నివేశంలో నటిస్తోంది. ఒక్క సెకను అయ్యిందో లేదో వెనకనుంచి గొంతు వినబడింది 'రింకూ ముందు వెనక్కి నడిచి కాంతిని పట్టుకో ' బిమల్దా కంఠం!!
కానీ అదే ఆయన సెట్ లోంచి ఆఖరి సారిగా వెళ్లడం. మళ్ళీ ఎప్పటికీ రాలేదు. కొన్నాళ్ళు జ్వరం, కొన్నాళ్ళు వంట్లో నలత, అంతే మా గుండెల్లో ఎవరో బాకుతో పొడిచినట్లు అయ్యింది. కాన్సర్. సుధీశ్దా, సుధీష్ ఘటక్, రిత్విక్ ఘటక్ అన్నయ్య, బిమల్దా సహచరుడు. ఆయన్ని అడిగాము వైద్యులు ఏమన్నారు అని. కానీ ఎవ్వరికీ తెలియలేదు.
టీ, సిగరెట్లు ఆయనకి అత్యంత ఇష్టమైన రెండూ అయన నుంచి దూరం చేయబడ్డాయి. లండన్ తీసుకు వెళ్లారు కానీ అప్పటికే బాగా ముదిరి పోయిందని వెనక్కి వచ్చేసారు. అయినప్పటికీ అమృతాకుమ్భేర్ సంధానే స్క్రీన్ ప్లే గురించి ఆయన ఇంకా తర్జనా భర్జన పడుతూనే ఉన్నాడు. నేను ఆయనింటికే వెళ్ళేవాడిని పని చేయడం కోసం. చాలా కష్టపడి ఆయన్ని ఒప్పించి బలరాం మృతి ఒకటి నుంచి అయిదవ రోజుకు మార్చాను. అప్పుడూ వాదిస్తూ ఉన్నా ఒక రకమైన బాధ నన్ను తొలుస్తూనే ఉండేది. ఇంకొన్ని రోజుల్లో ఆయన్ని ఇంక చూడలేనా? పని సాగుతోంది. బిమల్దా నన్ను అలహాబాద్ వెళ్లి కొన్ని షాట్లు తీసుకుని రమ్మన్నారు. ఆయన వెళ్ళలేరు కనుక. ఏమి చేస్తాను! కమల్దా నేను వెళ్లి ఏడెనిమిది రోజులు పని పూర్తి చేసుకుని వచ్చాము. యిద్దరం పరస్పరం ఒక్క ముక్క కూడా మాట్లాడుకోలేదు. ఏమి అనగలం. ఇద్దరికీ ఏమి జరగబోతోందో తెలుసు.
వెనక్కి వచ్చి అదే రోజు దాదా ఇంటికి వెళ్లి మిగిలిన పని పూర్తి చేసాము. ఆ తర్వాత మళ్ళీ వెళ్లి ఆయన్ని చూడలేక పోయాను. ఆయన కృశించుకు పోయాడు. సోఫామీద మెత్త లాగా. నేను ఆయన్ని అలాగా చూడలేక పోయాను. కొన్నాళ్ల తర్వాత ఫోన్ మ్రోగింది. అవతల నుంచి దాదా లాగా అనిపించే గొంతు 'గొల్జార్ వెంటనే రా అమృతాకుమ్భేర్ గురించి మాట్లాడాలి.' కానీ అప్పటికే ఆ చిత్రం నిర్మించబడదు అని నాకు అర్థం అయ్యింది. దాదా ఎక్కువ రోజులు ఉండడు. కానీ ఆయన నా గురువు. వెళ్ళాలి. ఉత్సాహంగా చెప్పాడు 'బలరాం కుంభ స్నానాల రోజు మరణిస్తాడు. మొదటి మృత్యువు. అప్పుడే త్రొక్కీసలాట మొదలు అవుతుంది.' చెప్పిందంతా విని తల మీద పిడి బాకు చల్లదనం ఆవహించగా వెనక్కి వచ్చాను.
జనవరి 8, 1966 బిమల్దా సుదూర తీరాలకి వెళ్ళిపోయాడు. వినంగానే వ్రేళ్ళాడుతున్నా కత్తి దిగినట్లయ్యింది. ఎలాగో కూడబలుక్కుని బాధ దిగమింగుకుంటూ బిమల్దా ఇంటికి ఆ తర్వాత శ్మశాన వాటికకు వెళ్ళాను. అక్కడ ఎప్పటి నుంచో మారు మూలకు త్రోసి వేసి తొక్కి పెట్టి ఉంచిన బుడగ ఒక్క సారిగా పగిలిపోయింది. కట్టలు తెంచుకుని బాధ ఉప్పొంగింది. ఏడిచి ఏడిచి ఇంకొంచం ఏడిచాను. దాదా మరణంతో మా నాన్న పోయిన దుఃఖం ఇప్పటికి తీరం దాటింది. ఆ రోజు కుంభ మేళాలో సాంప్రదాయ స్నానం.
Comments
Post a Comment