కార్తీక మాసం - నా గురుతులు
- న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
- న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్
- స్కంద పురాణంలోనిది ఈ శ్లోకం. కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. దీపావళి అయిన మరునాడే మొదలయ్యే కార్తీక మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? కార్తీక పురాణం స్వయాన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి, బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడని నమ్మకం. వసిష్ఠుడు రాజయోగి అయిన జనక మహారాజుకు చెప్పగా, అయన ఆచరించి లోకులకు తెలియజేసాడని ప్రతీతి.
- ఎంతో ఉత్సాహంగా, సామూహిక సంబరాలతో కనులవిందుగా జరిగే నవరాత్రులు, దీపావళి తరువాత, నిష్ఠతో అంతర్దృష్టులై ఆడంబరాలు వదిలి లోకేశుని ధ్యానంలో గడపటానికే కార్తీక మాసం అని మా నాన్నగారు చెప్పేవారు. అయన చిన్నతనం అంతా గోదారి గట్టున, కోనసీమలోని తొండవరం అనే కుగ్రామంలో గడిపారు. వారి తండ్రి (మా తాతగారు) ప్రతీ దినం గోదావరి మట్టితో పార్థివ లింగం చేసి అభిషేకించి తిరిగి నదిలోనే కలిపేవారట. పంచభూతాల మిశ్రమం ఈ మట్టి ఈ భూమి. తరతరాలుగా, యుగ యుగాలుగా ప్రవహించేవి మన జీవనదులు. వాటి పంచన కోటానుకోట్ల జీవరాసులు ఎగసి సమసి పోయాయి. ఈ అనంత విశ్వంలో ఒక చిన్న రేణువు మనం. నేను, నాది అన్న భావాన్ని వదిలి రేణువులో రేణువై మట్టిలో ఉద్భవించిన పార్థివ లింగమై అద్వైతానుభూతిలో చిదానందమవ్వడానికి కార్తీక మాసం పరమ సోపానం.
- నాన్న మాట సరే కానీ, కార్తీక మాసం అంటే నాకు గురుతుకు వచ్చేవి మా అమ్మ, ఆవిడ ఉపవాసాలు. మన సాంప్రదాయాలు ఇంకా కొనసాగతున్నాయంటే అది అమ్మలు గన్న మన అమ్మలే కారణం. ఊరు నుంచి పట్టణాలకు నూకల వేటలో వచ్చి రూకల రోకటి బండలో చితికి అస్థిత్వం రెపరెపలాడుతుండగా, వంటింట్లో కేతనం ఎగురవేసి ఇది మన ఆచారం, ఇది మన ధర్మం అని చుక్కాని వేసిన దిక్సూచే అమ్మ. సూర్యోదయానికి ముందే లేచి చన్నీళ్ళ స్నానం చేసి దీపం వెలిగించేది. చలికి ముడుచుకుపోయి దుప్పటి తన్నుకుని పడుకున్న మాకు ఆవిడ బిగ్గరగా చదివే శ్లోకాలు, దూరాన గుడినుంచి వినబడే మంగళ వాద్యాలుగా చెవిని తట్టేవి. పగలు అరటిపండు ఎండు ఖర్జూరం కలిపిన పాలు మాత్రమే త్రాగేది. మధ్యాన్నం మా రైల్వే క్వార్టర్స్ బాల్కనీలో మూలగా మోడా మీద కూచుని కార్తీక పురాణం కథలు చదివేది. సన్నగా వీచే గాలికి మెల్లగా ఊగే ఆకుల సందుల నుంచి రవి కిరణాలు అమ్మ ముఖంపై ఛాయాచిత్రాలు గీసేవి. భానుడు పడమటింటికి ఏగగా చీకటితో అంతా "న వ్యక్తం" అయినపుడు నక్తం భోజనం చేసేది. శివుడికి ప్రీతికరమైన గారెలు, పాయసం, చిక్కుడుకాయ బెల్లం , ఆనపకాయ పెసర పప్పు కూర అరిటాకు మీద వేసి మా రాత్రి భోజనం. ఆరున్నరకే అన్నాలు అయిపోయేవి. కార్తీక సోమవారం అంటే ఇంక కటిక ఉపవాసం చేసేది. మేము మాత్రం వచ్చే వారం ఉపవాసం ఉంటామంటూ దాటేసి మొత్తానికి ఒక సారో రెండు సార్లో ఉండేవాళ్ళం.
- దీపావళి అయిన మరునాడే బలి పాడ్యమితో శ్రీకారం చుట్టే కార్తీకంలో అమ్మ రోజూ తులసమ్మ దగ్గర ఆకాశదీపం పెట్టడం మరిచేది కాదు. చిన్న చిన్న రంధ్రాలు ఉన్న ఇత్తడి ప్రమిదిలో దీపం ఉంచేది. ఆ చిల్లులనుంచి వచ్చే కాంతి పుంజాలు నేల మీద, గోడ మీద రకరకాల ఆకృతులు చేసేవి. భగినీ హస్త భోజనం నాడు మా అన్నయ్యకి మా చేతులతో అన్నం పెట్టించేది. యమునా నది యముడి చెల్లెలు. సర్వ ప్రాణుల ధర్మపాలనను భేరీజు వేసే సమవర్తి కర్తవ్య నిర్వహణలో మునిగిపోయి చెల్లెలుకి కనపడక పోవడంతో ఆమె వెళ్లి ఇంటికి రమ్మని ప్రార్థించింది. యముడు ఆమె ఆప్యాయతకు ముగ్ధుడై ఈ అన్నాచెల్లెళ్ల పండుగ నాడు సహోదరి చేతి ముద్ద తిన్నవారికి, తినిపించిన వారికీ ఉత్తమ గతులు కలుగుతాయని ఆశీర్వదించాడు. కథ మాట అటుంచితే, దూరాల దారులలో బేరాల బీడులలో కడతేరిపోయే బంధాలు నిలబడాలంటే అలనాటి మన ఆచారాలే ఆయువు పట్టు.
- నాగుల చవితి నాడు అమ్మ తెల్ల చలిమిడితో గోడ మీద పాము ఆకారం మెత్తేది. దానికే పూజలు, పాలు పోయడం. బయట పుట్టకు వెళ్లి పాలు పోసినట్లు నాకు అయితే గుర్తు లేదు. నువ్వులు బెల్లంతో చిమ్మిలి తినేవాళ్ళం. కడుపు చలువకి ఈ రోజుకీ ఇంట్లోచి బయలుదేరేప్పుడు అమ్మ చలిమిడి ఇస్తుంది. ఆ చలిమిడి బెల్లంతో చేయడం వల్ల కొంచం పసుపు పచ్చ ఛాయతో ఉంటుంది. నాగుల చవితినాడు మాత్రం తెల్లటి చక్కర చలిమిడి అరటిపండు ప్రసాదం.
- కార్తీక పౌర్ణమికి మూడు దినాల ముందు క్షీరాబ్ధి ద్వాదశి. దీనికి చిలుకు ద్వాదశి, తులసి ద్వాదశి అని కూడా పేరు. దేవాసురులు క్షీర సాగర మథనం చేయగా యోగ నిద్రలో ఉన్న శ్రీ మహా విష్ణువు మేలుకొని దర్శనమిచ్చిన రోజు. సముద్ర గర్భం నుంచి వెలువడిన లక్ష్మీ దేవిని మనువాడిన రోజు కూడా ఇదే అంటారు. ఉసిరి కొమ్మను తులసి తొట్టెలో పాతి లక్ష్మీనారాయణుల ప్రతిరూపంగా అమ్మ పూజించేది. ఉసిరికాయ మరియు చలిమిడిలో పెట్టిన దీపాలు వెలిగించేది. ఇంట్లో పిల్లలకు చేతిలో నాణెం పెట్టడం కూడా అలవాటు. నేను మన పుణ్య భూమి వదిలి వచ్చి పాతిక సంవత్సరాలు అవుతుందో. కానీ ప్రతీ ఏడాది ఈ రోజున తప్పకుండా ఉసిరి దీపాలు వెలిగిస్తాను.
- ఇక కార్తీక మాసం చివరలో వచ్చే పర్వదినం పోలి స్వర్గం. అచ్చమైన మన తెలుగింటి కథ. అత్తా కోడళ్ల మధ్య ఉండాల్సిన సఖ్యత తెలిపే కథ. పోలి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని నెలంతా దీపాలు వెలిగించిన సందర్భం గుర్తు తెచ్చుకుంటూ అందరి స్త్రీల లాగానే అమ్మ కూడా అరటి దొప్పలతో వత్తులు వెలిగించి ఇంట్లోనే నీటి తొట్టెలో వదిలేది. మేమందరం కూడా అదే చేసి చుట్టూ చేరి అవి ఎంత దూరం ఎంత సేపు వెళ్తాయో పోటీపడేవాళ్ళం.
- సనాతనంగా వచ్చిన కార్తీక సాంప్రదాయాలు శరీరాన్ని మనసుని నియమించే సాధనాలు. శరీరమే మన కర్మభూమి. అన్ని తీర్థ యాత్రల కన్నా కష్టతరమైనది మనని మనం శోధించుకునే యాత్ర. మనలోని మంచి చెడులను మధించి అహాన్ని దహించి కార్తీక ఆకాశ దీపంగా ఆత్మ జ్యోతిని వెలిగించడమే జీవిత పరమార్థం.
- -- ఉషా వెంపరాల మాటలు, పవన్ చిట్టాప్రగడ రాతలు
Comments
Post a Comment