స్వప్నదర్శనము

 

డా. లంకా సత్యనారాయణ రచించిన VisionVennela Gangotri) కి స్వేచ్ఛానువాదం... 


అగమ్య గోచరమైన జీవనంలో, మసకబారిన కనులతో

శోకతప్త భాష్పాలు కారని మనిషి ఎవడైనా ఉన్నాడా?

కొండలలో కానలలో, జన సమూహంలో నిర్జిత ఎడారిలో వెతికాను వృధాగా.


ఎచట చూసినా కన్నీటి ధారలతో తడిసి ముద్దైన మానవులే,

ఎటు చూసినా నాకు కనపడేది జన సందోహం,

బాధల భారంతో కాళ్ళు ఈడుస్తూ బ్రతుకు బరువు మోస్తూ.

అన్నీ దిక్కులా కన్నాను దిక్కు తోచని మనుషులు

విన్నాను శృతి మించిన పాటలు, గతి తప్పిన గీతాలు, తడబడే అడుగులు.


ఓ భగవంత!

నీ ప్రేమ సౌధం చేరాలని

మనిషిని ఇలా సృజించావా?

ఎంతో విడ్డురంగా స్వప్నాలలో

అవధులు లేని విశ్వ సౌందర్యం జాలు వారగ

మనిషి ప్రభాత భాస్కరుని తేజాన్ని రాగాలలో పులుముకున్నాడు

యెడతెగని తన యానం వెలుగుల బాట అవ్వాలని.


నువ్వేనా మా నుదుట ఈ వ్రాత రాసింది?

చెప్పగలవా మా విధి ఈ విధంగా ఎందుకు మలచావో?

ఓ భగవంత!

ఎందుకు ఈ ప్రపంచాన్ని ఇంత మనోహరంగా సృష్టించి

మనిషిని కోరికల అగ్ని కీలలలోకి నెట్టేసావు?

అంతులేని అంతుచిక్కని అజ్ఞాత దూర తీరాలకు కొట్టుకుపోయాడు

మనిషి, కడతేరని తీరని ఆశల అలల కడలిలో.


తెగిన వీణా తంత్రులు తిరిగి కలపాలని ఆదేశించవా?

మనిషి, విషాద గేయం ఎలుగెత్తి పాడాలని ఆజ్ఞాపించవా?

నీ ఎడబాటు తాళలేడు మానవుడు,

అందుకే నీ నీలి మడుగుల కళ్ళలోకి తదేకంగా చూస్తాడు,

నీ తలపులను అన్వేషిస్తాడు, నీ గీతగా తన గాత్రంలో ఆలపిద్దామని.

 

మనుజుడు భావుకుడు

చకితుడైయున్నాడు నీ దివ్యత్వాన్ని చవిచూచి.

నీ వంత పాడాడు

నీ అమరగానంతో ముగ్దుడై.

అహోరాత్రులు బడలిక లేక పయనించే బాటసారయ్యాడు

సముద్రపు కెరటాలపై తేలుతో నీ జాడకై.

ఇపుడతను వేదాలు ఘోషించే మునిపుంగవుడు,

పవిత్ర జలాలలో స్నానిస్తూ,

రాగద్వేషాలను జయించి ఎగిసాడు.

చీకటి ఆలోచనలను చెల్లా చెదరు చేసాడు

అనంత విశ్వాన్ని తెలుసుకున్న తరుణంలో.

అతను ఇప్పుడు కాలి బూడిదైపోయిన ధూపం

తన సాంబ్రాణి పరిమళం నలుదిక్కుల వ్యాపించిన మనీషి.


ఓ ఋషిగా మారిన మనిషి!

నీ పయనం, పూల మాలలతో అలంకరించిన నావలలో 

చల్లని వెన్నెల గంగోత్రిలో

తరంగంలా చేరతావు సుదూరపు తీరాలకు

కాంతి పుంజాల దీప్త సాగరంలో,

అజ్ఞానపు అంధకారాలని పటాపంచలు చేస్తావు.


నీ జీవనం వసంతపు కోయిలల ఆలవాలం

స్వాగత సంకీర్తనల కలకలారావం

నిరంతరం మహతీ నినాదాలు మీటుతావు

విశ్వం యొక్క ఝంకారంలో ఓంకారమవుతావు

పరమానందమైన సంగీతం ఎల్లప్పుడూ వీనుల విందుగా

మ్రోగుతుంది నీ స్వరాలలో బ్రహ్మాండపు వేణువులో.

Comments

Popular posts from this blog

సుదీర్ఘ యానం

వేలకొద్ది ఆశలు అలాటివి

మట్టి